చదువు మీద ఏకాగ్రత కుదరటం లేదా?

చదివేటప్పుడు ప్రశాంతంగా, మనసు లగ్నం చేసి ఏకాగ్రతతో చదివితే మనం చదివింది మనకు సులభంగా అర్థమై బాగా గుర్తుంటుంది అని అంటారు కదా, చాలా మందికి ఏకాగ్రత కుదరకుండా ఏవేవో ఆలోచనలు వస్తూ సరిగా చదవలేరు, అలాంటప్పుడు చదువు మీద ఏకాగ్రత కుదిరేలా కొన్ని టిప్స్ ని ఇప్పుడు చూద్దాం.

మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, చదువే జీవితం కాదు. చదువు ఇష్టం తో చేయాల్సిన పని, తప్పదురా బాబు అని చేసే పని కాదు.

మీరు ఎప్పుడయినా గమనించారా? కొన్ని సబ్జెక్ట్స్ లేదా టాపిక్స్ ని మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టం గా చదువుతాం , మరికొన్ని అయిదు నిమిషాలు కూడా చదవలేం. దీనికి రెండు కారణాలు

1.ఆ సబ్జెక్ట్ / టాపిక్ మనకి ఇష్టం లేనిది కావటం.

2. అసలు చదవటమే ఇష్టం లేకపోవడం.

మీరు చదవటం మీద ఫోకస్ చేయలేకపోతుంటే , ముందు గా కారణాన్ని తెలుసుకోండి, మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ / టాపిక్ ని చదివేటప్పుడు ఫోకస్ చేయలేకపోతున్నారా? లేక అసలు చదివేప్పుడు ఫోకస్ చేయలేకపోతున్నారా?

మీకు ఇష్టమైన సబ్జెక్ట్ / టాపిక్ చదివేటప్పుడు మీరు చాలా ఇష్టంగా చదవగలుగుతుంటే, కొన్ని సబ్జెక్ట్ / టాపిక్ లు చదివేటప్పుడు మాత్రం ఫోకస్ చేయలేకపోతున్నారంటే దానర్దం మీకు ఆ సబ్జెక్ట్ / టాపిక్ ఇష్టం లేకపోవటం లేదా సరిగ్గా అర్థం కాకపోవటం.

ఈ సందర్భంలో మీరు చేయాల్సిన పని ఆ సబ్జెక్ట్ / టాపిక్ మీద ఇష్టాన్ని పెంచుకోవటం లేదా ఆ సబ్జెక్ట్ / టాపిక్ ని మీకు అర్థమయ్యేలా చెప్పగలిగే వాళ్ళ సహాయం తీసుకోవటం.

ఒకవేళ మీరు అసలు చదవటం మీదే ఫోకస్ చేయలేకపోతుంటే ఈ కింది సలహాలని ఒకసారి పాటించి చూడండి.

మీరు చదివేందుకు ఒక మంచి ప్లేస్ ని చూసుకోండి, రోజు ఒకే ప్లేస్ లో కూర్చుని చదవటం వలన, కొన్ని రోజుల తరవాత నుండి ఆ ప్రదేశానికి వెళ్ళగానే మీకు చదువుకోవాలనే ఇంట్రస్ట్ ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.

చదువుకునే ప్లేస్ ని ఎంచుకునేప్పుడు జాగ్రత్త, కిటికీ దగ్గరగా కూచును బయటకి చూస్తూ లేక టి.వి దగ్గర కూచుని చదవటం వలన డిస్ట్రబ్ అవుతారు కాబట్టి మీ దృష్టిని మరల్చేవి ఏవీ లేని ప్రదేశాన్ని ఎంచుకోండి.

ఇవాల్టి ప్రపంచంలో మొబైల్ ఫోన్ లేకుండా ఉండే వాళ్లు చాలా తక్కువ, మీరు చదివేప్పుడు మొబైల్ ని సైలెంట్ మోడ్ లో ఉంచండి, మీరు చదువుకునేప్పుడు ఎవరైనా పోన్ చేసినా తరవాత కాల్ బ్యాక్ చేయండి, చదివేప్పుడు మొబైల్ వాడకండి. 

ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే శరీరానికి, మనసుకి విశ్రాంతి చాలా అవసరం, మనం ఏదైనా పని మీద ఇరవై నిమిషాలు మాత్రమే ఫోకస్ చేయగలం, ఆ తరవాత ఫోకస్ మెల్లి గా తగ్గుతుంది.

చదివేటప్పుడు మీరు ఎంతసేపు ఫోకస్ గా చదువుతారో గుర్తించండి, తరవాత ఒక అయిదు లేదా పది నిమిషాల బ్రేక్ తీసుకుని మళ్లీ చదవటం మొదలుపెట్టండి.

ముందే చెప్పుకున్నాం కదా, చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, చదువే జీవితం కాదు. చదువు ఇష్టం తో చేయాల్సిన పని అందుకని చదువు మీద ఇష్టం పెంచుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి అప్పుడు అధ్భుతాలు చెయ్యగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *